తాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాదిరిగినా మంచి చరిష్మా, వాక్పటిమ కలిగిన జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల్లో ప్రవేశించే సమయం ఆసన్నం అయిందా అంటే, అవుననే మాటలు ప్రస్తుతం బయట ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం, ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అధినేతగా ఉన్న సమయంలో కూడా పార్టీ మొత్తాన్ని తన ఒంటి చేత్తో నడిపించి ముందుకు తీసుకెళ్ల గలిగిన చంద్రబాబు, ప్రస్తుతం పార్టీకి జరుగుతున్న నష్టాన్ని మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. దీనితో జూనియర్ రంగంలోకి దిగక తప్పే పరిస్థితి కనపడడం లేదు.
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ సీట్లతో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆ పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి పరిస్థితి ఎంతో దారుణంగా తయారై, కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. ఈసారి ఎవ్వరి మద్దతు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన టీడీపీకి ఇంత తక్కువ స్థాయిలో సీట్లు రావడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి అయితే గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా,మరియు విభజన హామీలు విషయమై ప్రజలకు ఇచ్చిన మాట తప్పడమే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ప్రస్తుతం పార్టీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారి పోతోంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోని ప్రముఖ నేతలు అందరూ ఒకరి వెంట మరొకరు రాజీనామా చేస్తూ బయటికి వెళ్ళిపోతున్నారు. దీనితో తలలు పట్టుకున్న అధినేత చంద్రబాబు, మళ్ళి పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావటానికి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి 2009 ఎన్నికల సమయంలో ఆకట్టుకునే వాక్చాతుర్యంతో టిడిపి పార్టీకి అప్పట్లో జూనియర్ చేసిన ప్రచారం చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం జూనియర్ టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ఆయన గనుక ఇటువంటి పరిస్థితుల్లో టిడిపికి అండగా ఉండి ప్రచారం నిర్వహిస్తే తప్పకుండా పార్టీ మళ్లీ పూర్వ స్థితికి వస్తుందని చంద్రబాబు సహా మరికొందరు టిడిపి నేతలు కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త రెండు రోజుల నుండి పలు రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ, ఇందులో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయి అనేది మాత్రం వెల్లడికావలసి ఉంది…..!!