గ్రేటర్‌లో ఎన్నికలు రసవత్తరంగా మారాయ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని డివిజన్లు అన్ని పార్టీలకు కీలకంగా మారాయ్. గెలుపు వ్యూహాలు రచిస్తూ ప్రధాన పార్టీలు ముందుకెళ్తున్నాయ్. ఐతే..ఏళ్లు గడుస్తున్నా అవే సమస్యలు జనాలను వెంటాడుతున్నాయ్. గత ఎన్నికలప్పుడు కనిపించిన నేతలు..మళ్లీ ఇప్పుడే ఓట్ల కోసం తిరుగుతున్నారు.
జీహెచ్ఎంసీలో జూబ్హీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. బడాబాబులు మొదలుకొని బస్తీవాసులకు ఈ సెగ్మెంట్ నిలయంగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో షేక్‌పేట్, వెంగళరావునగర్, రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ ఏడు డివిజన్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ డివిజన్లో సమస్యలనగానే మొదట గుర్తొచ్చేది ఫిల్మ్ నగర్ బస్తీ. హైదరాబాద్‌లోనే అతి పెద్ద మురికివాడల సముదాయం. మొత్తం 18బస్తీలు, కాలనీలు, వాడలుంటాయిక్కడ.
జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి 2002లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు కాజా సూర్యనారాయణ. 2009లో లేడీ జనరల్‌గా రిజర్వ్ కావటంతో కాంగ్రెస్ గెలుపు సాధించింది. 2016 ఎన్నికల్లో జనరల్‌గా మారింది. అప్పటి వరకూ టీడీపీలో ఉన్న కాజా సూర్యనారాయణ చివరి నిమిషయంలో టీఆర్ఎస్‌లో చేరి గెలిచారు. రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన తనకు డివిజన్‌లో అడుగడుగూ తెలుసని అంటారు కార్పొరేటర్. సమస్యల వైపు మాత్రం కన్నెత్తి చూడరు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరో డివిజన్ యూసుఫ్‌గూడ. జాతీయ క్రీడల కేంద్రం. కారు పార్టీ నేతల కుస్తీపట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ డివిజన్. సినీ కార్మికులకు అడ్డాగా ఉంది. రిక్షాపుల్లర్ నుంచి వీఐపీల వరకూ తిరిగే ప్రాంతం యూసుఫ్‌గూడ. కృష్ణానగర్‌లోని సినీ యూనియన్లు, మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. 2016లో సంజయ్ గౌడ్ 611 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎంబీఏ చేసి రాజకీయాల్లోకి వచ్చిన గుర్రం సంజయ్ గౌడ్ సోషల్ మీడియాలో ఎక్కువ…జనాల్లో తక్కువ అనే పేరుంది. లక్ష్మీనరసింహ నగర్, కృష్ణానగర్, పూర్ణ హోటల్ ఏరియాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
నలభై ఏళ్ల కిందట చిన్న కాలనీగా ఏర్పడ్డ వెంగళరావు నగర్ ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పరమైన ఈ డివిజన్ గతంలో కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడి సిట్టింగ్ అభ్యర్థి అభ్యర్థి ఇప్పుడు కారు దిగి కమల తీర్థం పుచ్చుకున్నాడు. యూసుఫ్‌గూడ డివిజన్లో ఉన్న ఇక్కడి కాలనీలు బస్తీలు..డీలిమిటేషన్లో భాగంగా ఇందులో కలిశాయి. వెంగళ్రావ్ నగర్‌లో ఎక్కువ మంది ఓటర్లు విద్యాధికులు. వ్యాపారవేత్తలు. సీమాంధ్ర జిల్లాల నుంచి వలస వచ్చి నలభై ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక్కడి కార్పొరేటర్ మనోహర్ ఇప్పుడు పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కార్పొరేటర్ అనుచరులు చిరు వ్యాపారులను వదలడం లేదనే ఆరోపణలున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరో డివిజన్ రహమత్ నగర్. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు బాగా పట్టున్న ఏరియా. ఇక్కడ జెండా పాతింది టీఆర్ఎస్. 2016లో వార్డుల డీలిమిటేషన్లో కొత్త రూపు సంతరించుకుంది. వార్డుల విభజన ప్రక్రియలో భాగంగా రహమత్ నగర్ బోరబండ వార్డులో కలిశాయి.ఇక రహమత్ నగర్ నాలా వల్ల డివిజన్లో అంటు రోగాలు ప్రబలుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు ప్రవహిస్తోంది. రహమత్ నగర్ డివిజన్లో హైదరాబాద్ హోటల్ యజమాని షఫీని నిలబెట్టింది టీఆర్ఎస్. షఫీ 2330 ఓట్ల తేడాతో కాంగ్రెస్ సిట్టింగ్ కార్పొరేటర్ బండ చంద్రమ్మపై విజయం సాధించారు. ముస్లింలకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ షఫీని ఈ డివిజన్‌కి కార్పొరేటర్‌ని చేశాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరో డివిజన్ షేక్‌పేట్. ఇక్కడ మైనార్టీల ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ఈ డివిజన్‌లో పోటీ చేసేందుకు ఎమ్‌ఐఎమ్ తప్ప మిగతా పార్టీలు పెద్దగా ఆసక్తి చూపించవు. షేక్‌పేట్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెరక మహేష్ 680 ఓట్ల తేడాతో ఎంఐఎం చేతిలో ఓడిపోయాడు. ఈసారి పార్టీ మహేష్‌కి కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చింది. దీంతో..మహేష్ బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నాడు. ఐతే…బీజేపీ నుంచి టికెట్ ఆశించిన శివకుమార్ వర్గం షాక్‌కి గురైంది. ప్రస్తుతం శివకుమార్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య హిందువుల ఓట్లు చీలి…మళ్లీ ఎంఐఎం గెలుపు సులువు అయ్యేలా ఉంది.
మరోవైపు…ఎర్రగడ్డ డివిజన్ తోపుడు బళ్లు…చిరు వ్యాపారులతో… నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిష్టాత్మక మానసిక చికిత్స ఆసుపత్రి ఉన్నా…లోపల పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. కూలిన ప్రహారి గోడలు…శిథిలావస్థకు చేరుకున్న భవనాలు.. ముళ్లపొదలతో ఆ ప్రాంతం అస్తవ్యస్తంగా ఉంటుంది.