తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కార్మికులను పిలవడాలు… చర్చలు పెట్టడాలు లేవని టీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చేసింది. రెండు రోజులుగా ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానిస్తారని.. ఆయన మధ్యవర్తిత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. కార్మిక సంఘాల నేతలు సైతం కెకె మధ్యవర్తిత్వం వహిస్తే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఒక్క రోజులోనే కెకె యూ యు టర్న్ తీసుకున్నారు. ఓ వైపు కేసీఆర్ చర్చల ప్రసక్తే లేదని చెప్పడం.. ఇటు కెకె చర్చలకు సిద్ధం కావాలని పత్రికా ప్రకటన విడుదల చేయడంతో ఏం జరుగుతుందో ? ఎవ్వరికి అర్థం కాలేదు.
కేకేకు అక్షింతలు పడ్డాయో ఏమో గాని ఆయన ఈ రోజు మాట తిప్పేశారు. కార్మికులతో చర్చలు జరపడానికి తనకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఇది ప్రభుత్వ సమస్య అని… పార్టీ సమస్య కాదని తెలిపారు. మంగళవారం మీడియా ముఖంగా కెకె ఈ విషయం చెప్పడం కొసమెరుపు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా కంట్రోల్ తప్పేశాయని… ప్రభుత్వం, కార్మికులు చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మాత్రమే తాను సూచించానని ఆయన చెప్పారు.
మధ్యవర్తిత్వం వహించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని… అయితే ప్రభుత్వం తరపున చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతులు రాలేదని కెకె స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాను ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. అయితే సీఎం కేసీఆర్ ఇంకా తనకు అందుబాటులోకి రాలేదని స్పష్టం చేశారు. అలాగే తాను సోషలిస్టును అయినందున రాజ్యం వైపు కాకుండా…. కార్మికుల పక్షానే ఉంటానని మరో బాంబు కూడా పేల్చారు.
ఇక అటు ఉద్యోగ సంఘాలకు కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా ఉండాలని… ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే తనకేమి అభ్యంతరం లేదన్నారు. అయితే ఆర్టీసీ విలీనం సాధ్యపడకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది తన అభిప్రాయం మాత్రమే అని చెప్పిన కెకె ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటో తనకు తెలియని చెప్పారు. ఏదేమైనా కేకే రోజు తేడాలోనే మాట మార్చేశారు.