మరోసారి కేఏ పాల్ రెచ్చిపోయారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూనే నేతలపై విమర్శలు గుప్పించారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రేపు ధర్నా నిర్వహిస్తున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తెలిపారు కేఏ పాల్. తన ధర్నాకు మద్దతివ్వాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తోపాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కోరారు కేఏ పాల్. మద్దతు కోరుతూనే వారిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ క్లౌడ్‌బరస్ట్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సీఎం స్థాయిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పదేళ్లలో తొమ్మిది పార్టీలతో కలిశాడని, రాజకీయాలకు ఆయన ఏమాత్రం పనికిరాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.
పవన్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా ఆయనను విడిచిపెట్టేశారన్నారు కేఏ పాల్. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పులతో దేశంతో త్వరలోనే శ్రీలంక, వెనిజులాలా మారడం ఖాయమని అన్నారు కేఏ పాల్ . హైదరాబాద్‌లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్‌లో పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.