తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. రోజు రోజుకూ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీల నుంచి కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. మరి కొందరు వేరే పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా టీఆర్‌ఎస్‌లో సీనియర్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ టీఆర్ఎస్‌ను వీడారు. హనమకొండలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు కన్నెబోయిన రాజయ్య. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు ఇప్పుడు లేవన్న కన్నెబోయిన రాజయ్య.. కేసీఆర్ కష్టసుఖాల్లో తాను పాలుపంచుకున్నానని, 22 ఏళ్లపాటు ఉద్యమంలో ఆయనతోపాటు నడిచానని గుర్తు చేసుకున్నారు. ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అన్నారు కన్నెబోయిన రాజయ్య. సొంతపార్టీ నేతలను కూడా ఆయన ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు కన్నెబోయిన రాజయ్య. బాధతోనే తాను పార్టీని వీడుతున్నట్టు రాజయ్య పేర్కొన్నారు.