అవును! సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రకాశం జిల్లా చీరాల నుంచి తాజా ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి, ఉరఫ్ బలరాం.. చుట్టూ కొన్నాళ్లుగా రాజకీయ చర్చ సాగుతూనే ఉంది. ఆయన టీడీపీ నుంచి వెళ్లిపోతారని, త్వరలోనే పార్టీ మారతారని, చంద్రబాబుకు ఝలక్ ఇస్తారని ఇలా అనేకానేక కథనాలు ఆయన చుట్టూ తిరిగాయి. గడిచిన ఆరు మాసాల్లో ఆయనపై వచ్చిన కథనాలు బహుశ ఆయన రాజకీయ జీవితంలో కూడా అన్ని వచ్చి ఉండవు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అయిష్టంగానేచీరాల నుంచి పోటీ చేసినా, గెలుపు గుర్రం ఎక్కిన కరణంకు ఇక్కడ రాజకీయంగా కుదురుకోవడం ప్రధాన విషయం.
రెండు, తన కుమారుడు కరణం వెంకటేశ్‌కు రాజకీయంగా ఓ వేదికను అప్పగించడం. ఈ రెండు కారణా ల ను విశ్లేషించిన వారు కరణం ఆట్టే కాలం టీడీపీలో కొనసాగబోరని చెప్పుకొంటారు. చీరాలలో గెలిచినా.. తాను చక్రం తిప్పాలంటే మాత్రం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలి. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ గతంలో రెండు సార్లు విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ దూకుడు. ఈయన తాజా ఎన్నికల్లో ఓడిపోయినా.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుతో ఆయనే అన్నీ అయి ఇక్కడ వ్యవహరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేని ఎవరూ లెక్కచేయడం లేదు. దీంతో డమ్మీ ఎమ్మెల్యే అనే ముద్రతోపాటు తాను వైసీపీకి మద్దతివ్వని పక్షంలో గతంలో నమోదైన కేసులు వెంటాడే పరిస్థితి ఉంది.
దీంతో కరణం.. పరోక్షంగా వైసీపీ బాటలో నడిచారనే వాదన కూడా ఉంది. ఇక, రెండోది తన కుమారుడుకి మంచి రాజకీయ భవితవ్యం కల్పించడం. ఇప్పటికే ఒకసారి అద్దంకిలో పోటీ చేసి ఓడిపోయిన కరణం వెంకటేశ్‌కు టీడీపీలో పెద్దగా గుర్తింపు లేదు. పైగాఆయనకు కూడా టీడీపీలో కొనసాగే ఉద్దేశం కూడా లేదు ఈ ఏడాది ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇప్పుడు తన కుమారుడి భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నా.. వైసీపీకి మద్దతివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే కరణం .. పార్టీ మారతారనే ప్రచారం జరిగింది.
అయితే, ఇప్పటి వరకు కరణం టీడీపీ నుంచి బయటకు రాలేదు. దీనికి కారణం.. పార్టీని వీడకుండా.. పరోక్షంగా వైసీపీకి మద్దతివ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నేరుగా పార్టీ మారినా మారకున్నా వచ్చే ప్రయోజనం ఒక్కటే కాబట్టి ఇదే బెటరని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నే చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఆయన పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో ఇంత రచ్చ జరుగుతున్నా.. మౌనం వహిస్తున్నారు. ఈ మొత్తం ఇలా ఉంటే.. బీజేపీ నుంచి కరణానికి ఆహ్వానాలు అందుతున్నా.. ఆయన ఆ సాహసం చేసే ప్రయత్నం చేయరని అంటున్నారు పరిశీలకులు. సో.. మొత్తానికి కరణం రాజకీయ కథ ఇదన్నమాట!!