మంత్రుల మధ్య వార్‌లో నలిగిపోతున్న జడ్పీ చైర్‌పర్సన్‌…!

-

కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి వచ్చిన తర్వాత మరో మంత్రి ఈటల రాజేందర్‌ కరీంనగర్‌ రావడమే మానేశారు. అధికారిక సమీక్షల్లో తప్ప ఏడాదిగా ఇద్దరూ కలిసి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆ మధ్య ఒకే కారులో ప్రయాణించి తమ మధ్య గ్యాప్‌ లేదని చెప్పినా.. ఇద్దరినీ బ్యాలెన్స్‌ చేయలేకపోతున్నారట లోకల్‌ ప్రజాప్రతినిధులు. ఈ జాబితాలో కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ కూడా చేరారు.

మంత్రి ఈటల వర్గానికి చెందిన నేతగా విజయకు గుర్తింపు ఉంది. జడ్పీ చైర్‌పర్సన్‌ హోదాలో ఆమె జిల్లా అంతా పర్యటించే అవకాశం ఉంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ప్రకారం ముందు వరసలో ఉంటారు. అయినా విజయకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. జిల్లాలోని ఇతర జడ్పీటీసీలు సైతం అధికారిక కార్యక్రమాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ను ఆహ్వానించడం లేదట. కరీంనగర్‌కు కేటీఆర్‌ లేదా మంత్రులెవరైనా వస్తేనే విజయ కనిపిస్తున్నారట.

కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్‌ రాగా.. పార్టీ వర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా విజయ ఫొటో లేదని సోషల్‌ మీడియాలో ప్రచారం ఓ రేంజ్‌లో సాగింది. జడ్పీ సమావేశాల్లోనూ అధికారులు గౌరవం ఇవ్వడం లేదని విజయే స్వయంగా ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలు ఉన్నాయి. విజయ విషయంలో ఎందుకిలా జరుగుతుంది అని ఆరా తీసిన వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయట. మంత్రులు ఈటల, గంగుల మధ్య ఉన్న వైరం వల్లే జడ్పీ చైర్‌పర్సన్‌కు గౌరవం ఇవ్వడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version