కరోనా వైరస్ తో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయాల్లో చాలా అసత్యప్రచారాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ యాంకర్ ఓంకార్ కి కరోనా సోకినదంటూ ఒక ఫేక్ న్యూస్ హాల్ చల్ చేసింది.
దీంతో ఆయన దానిపై వివరణ ఇచ్చారు. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా పుకారు మాత్రమేనని చెప్పారు. అయిటీ తాజాగా ఈ మహమ్మారి బారిన కత్తి మహేష్ పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్ కు కరోనా రావడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారంటూ.. ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉంది. దీనిపై స్పందించిన కత్తి.. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. నాకు కరోనా రావాలని కోరుకుంటున్న వారే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారేమో అన్నారు. నాకు కరోనా సోకిందని రుమార్లు సృష్టించేవారు శునకానందం మానుకొని ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని మహేష్ సలహా ఇచ్చారు.