హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీధి రౌడిలా తనపై దాడి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన ఘటన పై ఆయన తాజాగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి స్వతహాగా చేశారా..? లేక ఎవరైనా రెచ్చగొడితే చేశారా..? అనేది తేలాలి అన్నారు. ఘటన పై స్పీకర్ కు ఫిర్యాదు చేశాను. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు.
గతంలో ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పి.. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే.. తాను కూడా చేస్తానని సంజయ్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పై నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా.. కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.