సాధారణంగా గోదోరోళ్లు మాటలకే కాదు.. ఆతిథ్యానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. పండుగ వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికి వచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు ప్రత్యేకత ఉంటుంది. మర్యాదలతో చుట్టాలను కట్టిపడేయడంలో గోదావరి జిల్లాలకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతం యానాం వరక్త సంఘం గౌరవ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గత ఏడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్ తో పెళ్లి జరిపించారు.
కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ప్రూట్స్, శీతల పానీయాలు, ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పుల్లో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తె ఇద్దరినీ విందుకు ఆహ్వానించారు. ఈ విందులో వంటలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిపోయారు. అత్తారింట్లో ఏర్పాటు చేసిన విందును అస్సలు ఊహించలేదని.. శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే చూశాను అని సాకెత్ తెలిపారు.