బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. మళ్లీ ఎప్పుడు వెళ్తారో తెలియదు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ భూస్థాపితం కాబోయే సమితి అని.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్ అని విమర్శించారు. ఈ దేశాన్ని తెలంగాణను కాంగ్రెస్, కేసీఆర్ పూర్తిగా బ్రష్టు పట్టించారని.. తమ సొంత జాగీరు అని పరిపాలించాయని దుయ్యబట్టారు.
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్న అనంతరం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి ఎంత సేపు రాజకీయాలు, అవినీతి, సంపాదన పై మాత్రమే ఉందని.. అందువల్లనే ఈ దేశం వెనుకబడి పోయిందని ఆరోపించారు. పసుపు బోర్డు విషయంలో తనను అనేక రకాలుగా నన్ను టార్గెట్ చేశారన్నారు. పసుపు రైతుల ముసుగులో ఇండ్లపైకి, బండ్ల పైకి గుండాలను పంపించారని గుర్తు చేశారు.