దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా నేడు ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. రెండు వాహనాలలో వచ్చిన సిబిఐ అధికారులు బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలోని ఓ ప్రత్యేక గదిలో విచారిస్తున్నారు. సిబిఐ డిఐజి రాఘవేంద్ర వత్స ఆధ్వర్యంలో కవిత నివాసానికి చేరుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ టీంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు.
అయితే కవిత ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది. అయితే ఈ విచారణను ప్రత్యక్ష ప్రచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈడి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం కక్ష సాధిస్తుందని మండిపడ్డారు. కోర్టులలో వాదనలు లైవ్ ప్రసారం చేస్తున్నప్పుడు.. సిబిఐ విచారణను లైవ్ ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. సిబిఐ ఏం ప్రశ్నలు అడుగుతుందో? కవిత ఏం సమాధానం చెబుతుందో ప్రజలకు తెలుస్తుంది అన్నారు.