తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని అత్యంత కఠినం గా అమలు చెయ్యాలి తెలంగాణా సిఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే ఎవరూ కూడా మాట వినకుండా రోడ్ల మీదకు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. దీనితో తెలంగాణా పోలీసులు ఇప్పుడు లాక్ డౌన్ ని కట్టడి చేయడానికి గానూ కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నారు.
5 వేల బండ్లను ఒక్క రోజే సీజ్ చేసారు హైదరాబాద్ పోలీసులు. ఇది పక్కన పెడితే లాక్ డౌన్ తర్వాత కఠినం గా వ్యవహరించాలి అని కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒకవేళ ఎత్తివేసినా, లేక సడలించినా, ఆంక్షలు కఠినం గానే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. మే నెలాఖరు వరకు రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని, జనం ఒక్క చోటకు వచ్చే ఏ కార్యక్రమాన్ని అనుమతించవద్దు అని భావిస్తున్నారు.
వివాహాది శుభాకార్యాలు, మతపరమైన సమావేశాల నిర్వహణకు ఈ ఏడాది చివరి వరకు కూడా అనుమతించేది లేదని తెలుస్తుంది. ఒకవేళ పగలు జన సంచారానికి అనుమతి ఇచ్చినా సరే ఎక్కువ మంది బయటకు రాకుండా చూడాలని భావిస్తున్నారు. పుట్టిన రోజు కార్యక్రమాలు, ఇతరత్రా ఫంక్షన్లు అసలు అనుమతించకుండా చూడాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.