మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని తెలంగాణా సీఎం కేసీ ఆర్ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని ఆయన ఆదేశించారు.
ఈ రోజు కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పోరేషన్ లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. దీని పై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే రాష్ట్రంలోని అన్ని మున్సలిపాలిటీల పరిధిలోని విలీన గ్రామాల్లో సాదాబైనామాలతో జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి హామీ ఇచ్చారు.