రాజకీయంగా ఎవరైనా తమ సత్తా ఏంటో చూపించి…ప్రజల మనసులు గెలుచుకోవాలి…అలాగే ప్రజలకు తాము ఏం చేస్తున్నామో చెప్పుకుని ఓట్లు దక్కించుకోవాలి. కానీ ఈ మధ్య రాజకీయాల్లో ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా తక్కువగా ఉన్నాయి…ప్రత్యర్ధులని పెద్ద బూచిగా చూపించి, వారిని నెగిటివ్ చేసి ఓట్లు సాధించడమే ఇప్పుడు నాయకుల పని. ఈ పనిలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా ఆరితేరిపోయారని చెప్పొచ్చు.
ఇక 2018 ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి కరెక్ట్‌గా అదే సెంటిమెంట్ బయటకు తీశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుని బూచిగా చూపించారు. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే…టీఆర్ఎస్ శత్రువు …అయినా సరే కేసీఆర్, చంద్రబాబునే టార్గెట్ చేశారు..అదిగో మళ్ళీ చంద్రబాబు తెలంగాణకి వచ్చారు…మళ్ళీ మన రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారు…అవసరమైతే ఆంధ్రాలో కలిపేసుకుంటారని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులతో ప్రచారం చేయించి కేసీఆర్ రాజకీయంగా సక్సెస్ అయ్యారు…మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు.
ఇక ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్‌కు ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. మోదీని బూచిగా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. అసలు కేంద్రం..తెలంగాణకు ఏ మాత్రం సాయం చేయడం లేదని, అలాగే మోదీకి తెలంగాణ అంటే ఇష్టంలేదని, రాష్ట్ర విభజన కూడా ఆయనకు ఇష్టం లేదని, ఇక బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ తెలంగాణని ఆంధ్రాలో కలిపేస్తారేమో అంటూ టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం అందుకున్నారు. అంటే ఇప్పుడు మోదీని శత్రువుగా చూపించి సెంటిమెంట్ లేపి మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారు.. మరి కేసీఆర్ రాజకీయం ఈ సారి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.