తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారో ఆయన వ్యవహారశైలి చూస్తే అర్ధమవుతుంది. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి బిజెపి కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇవ్వాలని, వాళ్లకు రాష్ట్రంలో అవకాశం లేకుండా చెయ్యాలని భావించిన ఆయన వారం క్రితం జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కీలక హెచ్చరికలు చేసారు.
ఒక్క స్థానం పోయినా సరే మంత్రుల పదవి పోతుందని కెసిఆర్ హెచ్చరించారు. ఇక ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల అంశంపై చర్చించేందుకు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని కెసిఆర్ భావించారు. ఈ తరుణంలో దీనికి సంబంధించి వారికి ముందుగానే ఆయన సమాచారం ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా బుధవారం రాత్రే హైదరాబాద్ చేరుకోవాలని పార్టీ వర్గాలు స్పష్టంగా సూచించాయి.
అయినా సరే కొందరు పార్టీ సూచనను కనీసం పట్టించుకోలేదు. దీనిపై కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఉదయం పదిన్నర గంటలకే తెలంగాణ భవన్ చేరుకున్న ఆయన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం నేడు ఉదయం ఆలస్యంగా సమావేశానికి రావడం గమనించి క్లాస్ పీకారు. మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సమావేశానికి ఆలస్యంగా రావడంపై ఇలా ఎందుకు జరిగిందని వారి నుంచి వివరణ తీసుకున్నారు. కొందరు హాజరు కాకపోవడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.