అధికారంలో ఉన్న పార్టీలకు అణుకువ ఉండాలి గానీ…అహంకారం ఉండకూడదు. మేము అధికారంలో ఉన్నాం… మేము ఏం చేసిన చెల్లుతుంది… మేము చెప్పిందే వేదం..మేమే చేసేది న్యాయం… మేము చేసేదే గొప్ప… అనుకుంటే ఏ అధికార పార్టీకైనా తిప్పలు తప్పవు. ఏ అధికార పార్టీకైనా అహంకారం ఉంటే ఎప్పటికైనా దెబ్బ తింటుంది. అదే అణుకువతో ఉంటే అద్బుతలు చేయొచ్చు. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు అణుకువ తక్కువగానే ఉందని చెప్పాలి.
తెలంగాణ విభజనతో… తెలంగాణ సాధించిన పార్టీగా ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కట్టారు. ఆ తర్వాత అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మరొకసారి అధికారంలోకి వచ్చింది… కేవలం రెండుసార్లు అధికారంలోకి రావడానికి సెంటిమెంట్ మాత్రమే కారణం. అలా అని టీఆర్ఎస్ ఏమి.. అద్భుతమైన పాలన చేసేస్తుందని కాదు… ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసేస్తుందని కాదు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ ఎన్నిసార్లు మాట తప్పారో… తెలంగాణ ప్రజానీకానికే తెలియాలి.
సరే మరీ ఏం చేయలేదని చెప్పడానికి లేదు… మంచి మంచి కార్యక్రమాలు చేశారు. గతనికి భిన్నంగా తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. కానీ అంతా బాగున్నా సరే.. అధికారం ఉందని అహంకారం ఉంటే మాత్రం ఎప్పటికైనా దెబ్బ తినక మానదు. టీఆర్ఎస్ నేతలు అధికార అహాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించారు… అసలు ప్రతిపక్షాలు ఉండకూడదని ఎలాంటి రాజకీయం చేశారు… ప్రతిపక్ష నాయకులని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయాలని చూశారో అందరికీ తెలిసిందే.
అయితే అదే అహంకారంతో తెలంగాణ రావడంలో కేసీఆర్‌తో పాటు ముఖ్య పాత్ర వహించిన ఈటల రాజేందర్‌ని ఎలా దెబ్బకొట్టాలని చూశారో కూడా తెలిసిందే. ఆయన్ని ఎలాంటి అవమానాలకు గురి చేశారు… ఆయన్ని ఎలా క్యాబినెట్ నుంచి తీసేసి… పార్టీలో నుంచి వెళ్లిపోయేలా చేశారో కూడా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఇక ఈటల చిన్న మనిషి అని హుజూరాబాద్‌లో ఆయన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నించారో కూడా తెలిసిందే. అందుకే హుజూరాబాద్ ప్రజలు ఆ అహంకారంపై దెబ్బ కొట్టారు. ఆత్మగౌరవాన్ని గెలిపించి… అధికారమనే అహంకారాన్ని తల దించేలా చేశారు.