టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఓట్లను తెచ్చిపెడుతున్న పథకం పింఛన్లనే చెప్పాలి. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు ఓట్లు గంపగుత్తగా పడుతున్నాయంటే అది పింఛన్లు తీసుకుంటున్న వారివే అని చెప్పాలి. ఇక ఇప్పుడు గులాబీ బాస్‌కు పెద్ద సవాల్‌గా మారింది హుజురాబాద్ ఉప ఎన్నిక. అక్కడ ఇజ్జత్ కా సవాల్ గా ఉండటంతో ఆ నియోజకవర్గ ప్రజలకు వరాలు ప్రకటించి మరీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ వేస్తున్నారు గులాబీ బాస్.
ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల్లో టీఆర్ఎస్ నేతలు పర్యటనలు చేస్తూ ప్రజలు ఏం కోరుకుంటే అది వెంటనే సాంక్షన్ చేయిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా, రాష్ట్రంలోనే బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను ఓడించాలంటే కొత్తగా పింఛన్లు ఇస్తేనే మరిన్ని ఓట్లు పడుతాయని గులాబీ నేతలు భావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు ఇస్తామని చెబుతున్నా కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వని కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం చాలా మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేయడానికి రెడీ అవుతున్నారు. ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి కేసీఆర్ పింఛన్ల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఎలాంటి పథకాలు అయినా కేసీఆర్‌కు ఓట్లు తెస్తాయో లేదో గానీ పింఛన్లు మాత్రం ఓట్లు కచ్చితంగా రాలుస్తాయని కేసీఆర్ నమ్ముతున్నారు. చూడాలి మరి కేసీఆర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.