అది బంగారంతో చేసినా, వజ్రాలతో పొదిగినా, ప్లాటినమ్ తో చెక్కినా ఆభరణానికి ఉన్న విలువ మారిపోదు. అందంగా ఉంటారని ఆభరణాలు అలంకరించుకుంటారు బానే ఉంటుంది. కానీ వాటిని ఎలా దాస్తున్నారు? సురక్షితంగా ఎలా ఉంచుతున్నారు? దానికోసం ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న ఆభరణాలని జాగ్రత్తగా పెట్టడంలో ఎలాంటి టిప్స్ పాటిస్తున్నారు? లేదా వీటిని దాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఐతే ఒక్కసారి ఇది తెలుసుకోండి.
వేరుచేసి విడిగా ఉంచండి
ఆభరణాలను ఒక్కోదాన్ని వేరు చేసి విడిగా పెట్టాలి. అన్ని ఆభరణాలే కదా ఏమవుతుందన్న ఉద్దేశ్యంతో ఒకే చోట పెడితే, పాడవుతాయి. ఒక్కోదాన్ని విడివిడిగా మెత్తటి వస్త్రంలో లేదా ఎలాంటి కలుషితం లేని దూదిలో పెట్టండి. సూర్యుడు ఎండ పడకుండా, తేమ తగలనీయకుండా, ఎక్కువ ఉష్ణోగ్రత రానిచోట ఆభరణాలని దాచాలి. లేదంటే రసాయనిక చర్య జరిగి ఆభరణాల రంగులో మార్పులు వస్తాయి.
చివరగా ధరించండి
మేకప్ పూర్తిగా అయిపోయిందనుకున్న తర్వాతే ఆభరణాలని ధరించండి. ముందుగా ఆభరణాలు ధరించి, ఆ తర్వాత మేకప్ కోసమని ఆ క్రీము, ఈ క్రీము రాసుకోవద్దు. దానివల్ల ఆభరణానికి అంటుకుని దాని మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
మెల్లగా శుభ్రం చేయండి
ఆభరణాలని అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. సబ్బునీళ్ళలో మెత్తటి బ్రష్ తో శుభ్రం చేయాలి. గట్టిగా రుద్దకండి. దానివల్ల ఆభరణాల మెరుపు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఆభరణాలని శుభ్రం చేయడానికి మార్కెట్లో చాలా వస్తువులు దొరుకుతాయి. నిపుణులని సంప్రదించిన తర్వాత వాటిని వినియోగించండి.
సర్టిఫికేట్ ఉన్న చోటే ఆభరణాలను కొనండి.
ఆభరణాల అమ్మకందారుకి దాన్ని అమ్మే అర్హత ఉన్నప్పుడే కొనండి. లేదంటే చిక్కుల్లో పడతారు.