ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.సివిల్ లైన్స్ ఏరియాలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లో ఉన్న నివాసం నుంచి తన కుటుంబంతో కలిసి ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చారు. ఇటీవలే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన అధికారిక నివాసం ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని బంగ్లాలో ఇకపై కేజ్రీవాల్ నివాసం ఉండనున్నారు.
పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు అధికారికంగా కేటాయించిన బిల్డింగ్‌లో కేజ్రీవాల్ ఉండనున్నారు.అది ఫిరోజ్‌షా రోడ్డులో ఉన్నది. కేజ్రీవాల్ వెళ్లిపోయే సమయంలో పలువురు సిబ్బంది ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. కాగా, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ అరెస్టై తిహార్ జైలులో సుమారు ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు.