ఇది మీ జిల్లా కాదు.. మీకు ఇక్కడ కాన్పు చేయలేమని ఓ గర్బిణి మహిళను ఆస్పత్రి నుంచి ప్రసూతి డాక్టర్లు పంపించి వేశారు. ఈ ఘటన జనగామ జిల్లాలో శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జనగామకు చెందిన శృతికి భువనగిరికి చెందిన మిట్ట వేణుతో వివాహం జరిగింది. ప్రస్తుతం శృతి గర్భవతి. ఆమెకు నాలుగో నెల అప్పటి నుంచి జనగామ మాతా,శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లోనే పరీక్షలు చేయిస్తున్నారు.చివరి నెల పరీక్ష కోసం శృతిని ఆమె తల్లి మళ్లీ ఎంసీహెచ్‌కు తీసుకు వెళ్లగా ప్రసూతి వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదాద్రి జిల్లాకు చెందిన గర్భిణివి ఇక్కడికి ఎందుకు వచ్చావ్..వేరే జిల్లాకు చెందిన వారికి ఇక్కడ కాన్పు చేయం.మీ జిల్లాలో పెద్దాస్పత్రి ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు.దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, స్థానికంగా ప్రసూతి డాక్టర్ల కొరత ఉండటంతో, అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో కాన్పు చేయించుకోవాలంటున్నామే తప్ప సొంత జిల్లా కాదని నిరాకరించలేదని, శృతిని అడ్మిట్ చేసుకోవాలని డాక్టర్లకు చెప్పామని తెలిపారు.