ఆర్గానిక్ వ్యవసాయం ప్రస్తుతం ఎంతటి లాభసాటిగా మారిందో అందరికీ తెలిసిందే. కేవలం సహజసిద్ధమైన ఎరువులను మాత్రమే వేస్తూ.. పంటలను పండిస్తూ.. చాలా మంది అధిక శాతం దిగుబడి సాధిస్తున్నారు. లాభాల బాట పడుతున్నారు. అయితే స్థలం ఉంటే ఆర్గానిక్ ఫామింగ్ బాగా ఉపయోగపడుతుంది.. కానీ స్థలం లేకపోతే ఎలా..? అంటే.. అందుకు ఆయన ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. అందులో భాగంగానే ఆయన ఏకంగా తన ఇంటి డాబాపై పెద్ద ఎత్తున అనేక రకాలకు పైగా మామిడి పండ్లతోపాటు ఇతర పండ్లు, కూరగాయలను కూడా పండిస్తున్నారు.
కేరళలోని ఎర్నాకులంలో నివాసం ఉండే జోసెఫ్ ఫ్రాన్సిస్ (63)కు వ్యవసాయం అంటే ఆసక్తి. అయితే అందుకు స్థలం లేదు. అయినా ఆయన దిగులు చెందలేదు. తన ఇంటిపై ఉన్న స్థలాన్నే పంటలు పండించడం కోసం ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నాడు. 1800 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటి డాబాపై ఆయన మొదట్లో గులాబీలు, ఆర్కిడ్స్, పుట్టగొడుగులు పండించే వారు. కానీ తరువాత ఓ ఎక్స్‌పో పలు రకాల మామిడికాయల వెరైటీలను ఆయన గమనించి వాటిని తన ఇంటిపై పెంచాలని అనుకున్నారు. వెంటనే తన ఆలోచనను అమలు చేశారు.
ఇక అప్పటి నుంచి జోసెఫ్ వెనక్కి తిరిగి చూడలేదు. అలా 20 సంవత్సరాల నుంచి ఆయన తన ఇంటి డాబాపై అనేక రకాలకు చెందిన మామిడి పండ్ల వెరైటీలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి డాబాపై 50 రకాలకు పైగా మామిడి వెరైటీలు పండుతున్నాయి. ఇక వాటిని పెంచడం కోసం ఆయన పీవీసీ డ్రమ్ములను కట్ చేసి ఉపయోగిస్తున్నారు. మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని అందిస్తూ.. పూర్తిగా సహజసిద్ధమైన పద్ధతిలో మామిడి పండ్లను పండిస్తున్నారు.
అయితే కేవలం మామిడి పండ్లను అమ్మడం మాత్రమే కాదు.. ఆయా వెరైటీలకు చెందిన మామిడి మొక్కలను కూడా ఆయన రూ.2500 మొదలుకొని రూ.10వేల వరకు పలు మొక్కలను అమ్ముతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిపై ఉన్న మామిడి చెట్లను చూసేందుకు, మొక్కలను, పండ్లను కొనుగోలు చేసేందుకు నిత్యం చాలా మంది ఆయన ఇంటికి వస్తుంటారు. ఇక కేవలం మామిడి పండ్లే కాదు, ఆయన తన ఇంటి ఆవరణలో పనస, బొప్పాయి, సపోటా తదితర పండ్లు, కాకరకాయ, క్యాబేజీ, బెండకాయ, టమాటాలు తదితర కూరగాయలను కూడా ప్రస్తుతం పెంచుతున్నారు. అలాగే ఆక్వాపోనిక్స్ విధానంలో 50 వెరైటీలకు పైగా ఆర్కిడ్స్‌ను ఆయన పెంచుతున్నారు. ఇక చేపలను కూడా త్వరలోనే పెంచనున్నారు. ఈ విధంగా జోసెఫ్ తన ఇంట్లోనే వ్యవసాయం చేస్తూ.. చక్కని స్వయం ఉపాధిని కల్పించుకున్నారు. నెల నెలా రూ.వేలల్లో ఆయన సంపాదిస్తున్నారు. ఈ విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే.. సొంత ఇండ్లు ఉండేవారు ఆర్గానిక్ వ్యవసాయం, ఇతర ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. పంటలను పండించి.. చక్కని ఆదాయం పొందవచ్చు..!