టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది..పార్టీ,ప్రభుత్వంలో కీలక మార్పులు తప్పవా ?

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు ముందు తర్వాత జరుగుతున్న పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అసలు అధికార పార్టీలో ఏం జరుగుతుందా అని ఆరా తీస్తున్నారు సొంత పార్టీ నేతలు. హస్తిన వెళ్లడానికి ముందు మంత్రి హరీష్‌రావుపై పొగడ్తలు.. ఢిల్లీలో మోడీ, షాలతో సమావేశాలు… అక్కడి నుంచి వచ్చాక ఫామ్‌హౌస్‌తో మంత్రి కేటీఆర్‌తో సుదీర్ఘ సమాలోచనలు దేనికి సంకేతం అని చెవులు కొరుక్కుంటున్నారట. దుబ్బాక, జీహెచ్ఎంసీఎన్నికల తర్వాత గులాబీ బాస్‌ ఆలోచన మారిందా అన్నదాని పై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ మార్పులు ఉంటాయని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగానే ఈ పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు నాయకులు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు కేసీఆర్‌. పార్టీలో కేటీఆర్‌ ప్రాధాన్యం.. బాధ్యతలు పెంచుతూ వెళ్లారు. ఆపై కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతున్నారనే ప్రచారం పీక్‌కు వెళ్లింది. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరి నోట విన్నా.. కేటీఆర్‌ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ ఈ అంశంపై ప్రకటన చేయడంతో ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది కానీ.. అంతర్గతంగా చర్చ మాత్రం ఆగలేదని అంటారు గులాబీ నేతలు.

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు అవుతోంది. దుబ్బాక, జీహెఛ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు. ఇదే సమయంలో సిద్ధిపేటలో హరీష్‌రావుపై ప్రశంసలు.. ఫామ్‌హౌస్‌లో కేటీఆర్ తో జరిపిన చర్చలను ఉటంకిస్తున్నారు నాయకులు. రెండోసారి కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరునెలలపాటు హరీష్‌రావు, కేటీఆర్‌లను కేబినెట్‌లోకి తీసుకోలేదు. ఏం జరుగుతుందా అని అంతా ఆరా తీశారు. చివరకు వారిద్దరినీ మంత్రులను చేయడంతో ఊహాగానాలకు తెరపడింది.

ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన తర్వాత గతంలో కంటే బలంగా చర్చ జరుగుతుండటం పార్టీ నేతలను ఆశ్చర్య పరుస్తోంది. కేటీఆర్‌ సీఎం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దుబ్బాక ఉపఎన్నిక హరీష్‌రావుకు మింగుడు పడలేదు. కానీ.. గ్రేటర్ ఎన్నికల్లో అప్పగించిన బాధ్యతల్లో ఆయన సక్సెస్‌ అయ్యారు. సిద్ధిపేటలో డెవలప్‌మెంట్‌ వర్క్స్‌తో సీఎం కేసీఆర్‌ దగ్గర ఫుల్‌ మార్క్స్‌ కొట్టేశారు. దుబ్బాక ఫలితం తర్వాత ఓ రేంజ్‌లో హరీష్‌రావును పొగడటం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచిందట. అంతేకాదు.. టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్‌ చెప్పకనే చెప్పారని అనుకుంటున్నారు.

ఈ పరిణామాలను చూసిన వారు ప్రభుత్వంలోను.. పార్టీలోనూ మార్పులు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి.. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version