ఏపీ బీజేపీ మళ్లీ రాజధాని బాట ఎందుకు పట్టింది ?

-

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏడాదిగా ఉద్యమం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్రం బాధ్యత లేదని.. పార్టీ విధానం మాత్రం వేరు అని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టారు. దీనిపై పార్టీ ముఖ్యనేతల మధ్య పెద్దచీలికే వచ్చింది. ఒకరి మాటలు ఒకరు ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. అమరావతిపై పార్టీ లైన్ మీరారంటూ కొందరిని సస్పెండ్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. కేంద్రానికి సంబంధం లేదన్న కామెంట్స్‌తో అమరావతికి దూరమైన కమలనాథులు మళ్లీ ఎందుకు అటు అడుగులు వేస్తున్నారు.ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సడన్ గా లైన్‌ ఎందుకు మార్చారు..

బీజేపీ మళ్లీ రాజధాని అంశంపై మాట్లాడటం మొదలుపెట్టింది. 64 వేల ప్లాట్స్‌ సిద్ధం చేయాలనే డిమాండ్‌తో రెండు వారాల క్రితం కొందరు అమరావతి రైతులను పిలిచి విజయవాడలో మీటింగ్‌ పెట్టారు వీర్రాజు. లేటెస్ట్‌గా అమరావతి వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఏడాదిపాటు సాగుతున్న ఉద్యమంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం మాటతప్పింది అని వైసీపీని ప్రశ్నించారు వీర్రాజు. రైతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఈ కార్యక్రమం రాజకీయ చర్చకు దారి తీసింది. రాజధాని విషయంలో బీజేపీ తన లైన్ మార్చుకుంది అన్న చర్చ మొదలైంది.

రాజధానిలో మహిళా రైతులపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అప్పట్లో చేసిన కామెంట్స్‌ దూమారం రేపాయి. ఖరీదైన చీరలు కట్టుకున్న మహిళల ఉద్యమం అంటూ విష్ణువర్థన్ రెడ్డి గతంలో అనడంతో ఇంటా బయటా అభ్యంతరాలు వచ్చాయి. జనసేన కూడా తప్పు పట్టింది. ఇప్పుడు ఏకంగా వీర్రాజే అమరావతి రైతుల దగ్గరకు వెళ్లారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో రాజధాని విషయంలో దూకుడుగా ఉండేవారు. వీర్రాజు వచ్చిన తర్వాత లైన్‌ మారింది. అలాంటిది రాజధాని నిరసనల్లో స్వయంగా వీర్రాజే పాల్గొనడం పెద్ద చర్చకే కారణం అవుతోంది.

ఈవిషయంలో అధిష్ఠానం నుంచి సూచనలు వచ్చినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోందట. కొందరు జాతీయ పార్టీ నాయకుల చెప్పడం వల్లే మీటింగ్‌ పెట్టారని అనుకుంటున్నారు. అలాగే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన కూడా ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు అమరావతి పర్యటనకు ఒక కారణంగా చెబుతున్నారు. రాజధాని విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర పార్టీ పెద్దలకు గట్టిగానే చెప్పారట పవన్‌. ఆ తర్వాత వచ్చిన మార్పుల వల్లే వీర్రాజు అడుగులు అటు పడ్డాయట. బీజేపీ భిన్నమైన లైన్‌తో ఉంటే నష్టం జరుగుతుందని ఢిల్లీ పెద్దలకు చెప్పారట పవన్‌.

ఇక అందుకే కమలనాథులు పాత స్లోగన్‌ను మళ్లీ కొత్తగా వినిపిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఇదే మాటపై ఉంటరో.. మళ్లీ నాలుక మడతపెడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version