బీజేపీ పార్టీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ నెల 14 వ తేదీన ఖమ్మం ట్రీ టౌన్ స్టేషన్ ముందు సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే బీజేపీ పార్టీ కార్యక్తలు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. నిన్న ఆస్పత్రిలో చికిత్స మరణించాడు సాయి గణేష్. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి. ఈ తరుణంలో.. సాయి గణేష్ మరణించడానికి ముందు మీడియాతో మాట్లాడారు. తనను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు గురి చేశాడని చెప్పారు.
తన పై మంత్రి ఆదేశాలతో పోలీసులు 16 కేసులు నమోదు చేశారన్నారు సాయి గణేష్. అంతేకాదు.. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని… పోలీసులను చేతిలో పెట్టుకుని తనపై అక్రమకేసులు నమోదు చేయించారని ఆరోపించాడు. మీడియాతో మాట్లాడిన అనంతరం.. సాయి గణేష్ మరణించాడు. అయితే.. సాయి గణేష్ మరణించిన తర్వాత కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. ఇక సంఘటన పై బండి సంజయ్ కూడా తన స్టైల్ లో స్పందించారు. సాయి గణేస్ మరణానికి కారణమైన మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని బండి సంజయ్ అన్నారు.
మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటు అని.. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్త లేదని… నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి కొట్లాడే కార్యకర్త సాయి గణేష్ అని పేర్కొన్నారు.చట్టానికి లోబడి పాలకుల అక్రమాలు, దుర్మార్గాలపై న్యాయ బద్దంగా యుద్దం చేసిన యువకుడు గణేష్ అని.. అలాంటి యువకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిగణేష్ పోరాటం మరువలేనిదని.. టీఆర్ఎస్ నేతలు గూండాయిజానికి పోలీసుల కండకావరానికి బలైన పోయిన సాయి గణేష్ అని తెలిపారు. అటు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కూడా పువ్వాడను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్.. పువ్వాడ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. దీనిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.