ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని భారత దేశంపై దాడిగా అభివర్ణించిన ఆయన, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు, డిమాండ్లను వెల్లడించారు. ఖర్గే మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలని, వారిని వేటాడి మట్టుబెట్టేలా శక్తివంచన లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి అని ఆయన అన్నారు.
జాతీయ భద్రతపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఖర్గే సూచించారు. ఉగ్రవాద సవాలును ఏకాభిప్రాయంతో పరిష్కరించడానికి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇది రాజకీయాల సమయం కాదని, దేశ భద్రత కోసం అందరం కలిసి పనిచేయాలి అని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో సమన్వయం, సహకారానికి కట్టుబడి ఉందని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కొందని, మా అగ్ర నాయకత్వం ఈ పోరాటంలో తమ ప్రాణాలను కూడా త్యాగం చేసిందని ఆయన గుర్తు చేశారు.
పహల్గామ్ దాడి నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రికులకు రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఖర్గే కేంద్రాన్ని కోరారు. “యాత్రికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి,” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలకు తావులేదని ఖర్గే స్పష్టం చేశారు. దేశ భద్రత, ఐక్యత కోసం అన్ని పార్టీలు ఒక్కటై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. “ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం,” అని ఆయన హామీ ఇచ్చారు.