ఇది డిజిటల్ యుగం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఓ ఉదాహరణ. ఏ వయసులో ఏం మాట్లాడుకోవాలో తెలియని అమాయకత్వాన్ని నాశనం చేస్తున్న ఇంటర్‌నెట్, సోషల్ మీడియా నిర్వాకం ఇది.
ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ చాట్ లో మహిళలు, వారి దేహనిర్మాణం గురించి అసభ్యకరంగా మాట్లాడిన ముగ్గురు స్కూల్ పిల్లలపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేసారు. సెక్షన్ 465 (ఫోర్జరీ), 471, 469, 509 కింద ఢిల్లీ పోలీసు అధికారులు కేసులు నమోదు చేసారు. ఐటి చట్టం భారతీయ శిక్షాస్మృతి మరియు సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం) మరియు,
67 ఎ (ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక అసభ్యకరమైన చర్యలను కలిగి ఉన్న విషయాలను ప్రసారం చేయడం అలాగే మహిళలను వ్యక్తిగతంగా అవమానించడం వంటి సెక్షన్లను వారి మీద ప్రయోగించారు. ప్రాధమిక దర్యాప్తులో ముగ్గురు ప్రముఖ స్కూల్ కి చెందిన విద్యార్ధులు ఉన్నారని, చాటింగ్ లో యువతులు, వారి ఆకృతుల గురించి మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఇందుకోసం ఒక ప్రయివేట్ గ్రూప్ ని కూడా క్రియేట్ చేసారు.
మన దేశంలో ఇన్‌స్టాగ్రామ్ చాట్ మీద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన మొదటి కేసు ఇదే. సాకేత్ పోలీస్ స్టేషన్లో ఇన్‌స్టాగ్రామ్ చాట్ పై ఒక స్కూల్ ఫిర్యాదు చేసింది. ఢిల్లీ సైబర్ క్రైమ్ దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. ఈ వారం ముగ్గురు పిల్లలను, వారి తల్లిదండ్రులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. సదరు గ్రూప్ చాట్ ని కూడా బ్యాన్ చేసారు. వారి వయసు 15-16 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.