చంద్ర‌బాబు చేసిన ప‌నితో నాగార్జున‌కు న‌లువైపులా స‌వాళ్లే..!!

-

టీడీపీ విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు జిల్లా అధ్య‌క్షుడిగా ఎంపికైన కిమిడి నాగార్జున ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల‌రా?  త‌మ్ముళ్ల‌ను ఏక‌తాటిపైకి తీసుకురాగ‌ల‌రా?  అసంతృప్తుల‌తో కుత‌కుత‌లాడుతున్న సీనియ‌ర్ల‌ను పార్టీలైన్‌లోకి తీసుకువ‌చ్చి ప‌నులు చేయించుకునే రేంజ్‌లో చ‌క్రం తిప్ప‌గ‌ల‌రా? ఇప్పుడు ఇవ‌న్నీ ప్ర‌శ్నలే. కిమిడికి రాజ‌కీయంగా కుత కుత‌లాడిస్తున్న సంగ‌తులే! ఎందుకంటే.. విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు జిల్లా ప‌రిధిలో ఉన్న సీనియ‌ర్లు.. అంత ఆషామాషీ నాయ‌కులు కాక‌పోవ‌డం, సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో పాతుకుపోవ‌డం వంటివి లేలేత నేత నాగార్జున‌కు పెనుస‌వాలుగా ప‌రిణ‌మిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోకి వ‌స్తే.. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా పార్టీ పరిస్థితి ఉంది. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల తరువాత పార్టీ పూర్తిగా నిస్తేజానికి గురైంది. మాజీ మంత్రి సుజ‌య్ కృష్ణ రంగారావు.. గ‌డ‌ప దాట‌డం లేదు. ఆయ‌న సోద‌రుడు బేబినాయ‌న వైసీపీకి జై కొడుతున్నారు. కొంత మంది నాయకులు వైసీపీలో చేరిపోవటం.. సుజ‌య్‌, బేబినాయ‌న‌లు పార్టీ పరంగా అంతంత మాత్రంగా కార్యక్రమాలు చేస్తున్నారు.

చంద్ర‌బాబు ఇస్తున్న పిలుపున‌కు కూడా వీరు పెద్ద‌గా స్పందించ‌డం లేదు. ఇక‌, అశోక్‌గ‌జ‌ప‌తి రాజు కూడా పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.
ఆయ‌న కుమార్తె అదితి మాత్రం స్పందిస్తున్నారు. కానీ, ఆమెతో నాగార్జున ఏమేర‌కు క‌లుపుగోలుగా ఉంటారో చూడాలి. ఇక‌,  మ‌రో కీల‌క నాయ‌కురాలు మీసాల గీత‌.. విజయనగరం అసెంబ్లీ పరిధిలో గత ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు టిక్కెట్టు లభించకపోవటంతో అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఇప్పుడు ఈమెను కూడా లైన్‌లో పెట్టాలి.

అయితే, నాగార్జున వంటి జూనియ‌ర్‌కు ఆమె మాట వింటారా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. మ‌రోవైపు.. గజపతినగరం నియోజకవర్గంలో కొంత మంది నాయకులు వైసీపీలో చేరారు. దీంతో ఇక్కడ అసమ్మతి గళానికి ఆస్కారం లేకుండా పార్టీ శ్రేణులు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలి. ఇవ‌న్నీ ఇలా ఉంటే..వైసీపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ దూకుడు, ఆయ‌న కుటుంబ రాజ‌కీయ వ్యూహాల‌ను త‌ట్టుకోవాలి. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. నాగార్జున‌కు న‌లువైపులా స‌వాళ్లే క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆయ‌న ఏవిధంగా త‌ట్టుకుని ముందుకు సాగుతారో చూడాలి.

 

– vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Exit mobile version