ఆ ఘనత ప్రధాని మోదీదే : కిషన్‌ రెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని బీజేపీ స్టేట్ చీఫ్, మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువు చెప్పినట్టు శిష్యుడు కేసీఆర్ తల ఊపుతున్నాడని ఎద్దేవా చేశారు. 75 ఏళ్లుగా మహిళలకు అన్యాయం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి.. పాస్ చేయించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. 60 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించింది.. కానీ మహిళలకు న్యాయం చేయలేదన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మహిళలు ఉండాలని మోదీ ఆలోచించారని చెప్పారు. దేశంలో 11 కోట్ల టాయిలెట్స్ నిర్మాణం చేసింది మోదీ ప్రభుత్వమే అని చెప్పారు.

ప్రతి ఇంటికీ వంట గ్యాస్ ఇచ్చి మహిళలకు మంచి చేశారని చెప్పారు కిషన్ రెడ్డి. కేసీఆర్ మొదటి ఐదేళ్ల ప్రభుత్వంలో మహిళలు కేబినెట్ లో లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తిని కేసీఆర్ వెంట పెట్టుకున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జరిగిన ఓటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో లేరని చెప్పారు. ఈ విషయంలో మహిళలకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోదీ నిరుపేదలకు ఇండ్లను మహిళల పేరుపైనే ఇస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. నీతిమంతమైన ప్రభుత్వం, సమర్థవంతమైన ప్రభుత్వం నడుపుతున్న నేత మోడీ అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా స్కామ్స్ జరిగాయన్నారు. పేద కుటుంబం నుండి వచ్చిన మోదీ.. పేదల కోసం పని చేస్తున్నారని చెప్పారు. మహిళలకు అన్ని రకాల మంచి చేయాలని మోదీ ఆలోచిస్తున్నారని చెప్పారు. తెలంగాణ నుండి మహిళలు ప్రధానికి అండగా నిలబడాలని కోరారు. అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్ కు ప్రధాని రాబోతున్నారని, బేగంపేట్ ఎయిర్ పోర్టుకు వచ్చి మహిళలు మోదీకి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version