సోము వీర్రాజు బీజేపీని చంద్రబాబుకు అద్దెకిచ్చారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఎజెండా చంద్రబాబు సెట్ చేస్తాడు..సోము వీర్రాజు అమలు చేస్తారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకు బీ- పార్టీగా బీజేపీ మారిందని చురకలు అంటించారు. సోము వీర్రాజు టీడీపీకి బీ టీంగా బీజేపీని తయారు చేశారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ ను జిల్లాగా సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు.
పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల పలు ప్రాంతాలను కలిపారని.. జిల్లాల పునర్విభజన ప్రక్రియ చాలా అద్భుతంగా ఉందన్నారు. 11వేల ఆర్బీకే కేంద్రాలు , గ్రామ సచివాలయాలను సీఎం ఏర్పాటు చేశారని… అధికార వికేంద్రీకరణ చేస్తోన్న సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని 2018 పాదయాత్రలో స్థానికులు వైఎస్ జగన్ ను కోరారని.. జిల్లాల విభజన అనంతరం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని వైఎస్ జగన్ అప్పుడే హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారని… విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎంకు పాదాభివందనం చేస్తున్నానని కొడాలి నాని పేర్కొన్నారు.