మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. “మత్స్యకారులకు ఇచ్చే అరకొర సాయానికి కూడా జగన్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది అని తెలిపారు. అమ్మఒడి తీసుకుంటే మత్స్యకార భృతి ఇవ్వబోమని, ఇతర పథకాలు పొందితే అర్హులు కారని చెబుతూ, కడలి పుత్రుల కడుపు కొడుతోంది అంటూ విరుచుకుపడ్డారు రవీంద్ర. ఒక కుటుంబంలో నలుగురు చేపలవేటకు వెళితే, వారిలో ఒకరికే మత్స్యకార భృతి ఇవ్వడం వారికి అన్యాయం చేయడం కాదా అంటూ ప్రశ్నించారు ఆయన.
ఇంతకుముందు చంద్రబాబు వేలాదిమంది మత్స్యకారులకు 75-90 శాతం సబ్సిడీతో వలలు, పడవలు, చేపల నిల్వకు అవసరమైన ఐస్ బాక్సులు, ద్విచక్ర వాహనాలు అందించారు. వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారుడికి రూ.4వేల ఆర్థికసాయం అందించారు. చంద్రబాబు హయాంలో లీటర్ డీజిల్ ధర రూ.70లు ఉంటే, దానిపై మత్స్యకారులకు రూ.6 సబ్సిడీ ఇచ్చాము. వైసీపీ ప్రభుత్వం వచ్చాక డీజిల్ ధర రూ.102 కు చేరింది. రూ.32 ధర పెంచి, సబ్సిడీని రూ.9కి పెంచితే మత్స్యకారులకు మేలు చేసినట్టా అంటూ రవీంద్ర వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు.