రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహా, ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలన్నీ తెలంగాణను చుట్టేస్తున్నాయి. ప్రతిపక్షాలేమో అధికార పార్టీ వైఫల్యాలు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఎండగడుతూ ప్రజలలోకి వెళుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం తాము గడిచిన 9 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
మతోన్మాద ఎజెండాతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పినా కరీంనగర్ ఏక్తా యాత్రలో అసోం సీఎం, బండి సంజయ్ మాటల తీరు మారలేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండి పడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సెక్యులర్ పాలనలో ప్రజలు అభివృద్ధి పథంలో సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా విరాజిల్లాలన్నా, కేంద్రంలోని బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్‌తోనే వామపక్షాలు కలిసి నడుస్తాయని చెప్పారు.