ఆ టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏమైంది..?

-

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు.. ఎవ‌రు.. ఏం మాట్లాడుతారో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌రు అధికార పార్టీని తిడితే, మ‌రొక‌రు పొగుడుతారు. దీంతో పార్టీ శ్రేణుల‌తోపాటు , ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, మంత్రి కేటీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇలాంటి మంచి నేత మ‌న‌కు ఉండ‌టం మ‌న అదృష్ట‌మంటూ  ఆయ‌న చేసిన వ్యాఖ్యాలు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ప్ర‌పంచ‌మంతా తిరిగిన అనుభ‌వం గ‌ల వ్య‌క్తి మంత్రిగా ఉండ‌టం మన అదృష్ట‌మ‌ని, ల‌క్ష‌లాది మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌శంసించారు. దీంతో ఆస‌భ‌లో ఉన్న వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక‌ప‌క్క అధిష్టానం అధికార టీఆర్ ఎస్‌పై పోరుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తుంటే.. మ‌రోప‌క్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన మంత్రిని పొగ‌డ‌టం ఏమిట‌ని పార్టీ శ్రేణుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

నిజానికి కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి క‌ద‌లిక‌లు , మాటల తీరు చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటుంది. 2018 ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌గోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత అధిష్టానంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒకానొక ద‌శ‌లో రాష్ట్ర నేత‌ల‌ను సైతం టార్గెట్ చేసి మాట్లాడారు. ఈక్ర‌మంలోనే ఆయ‌న బీజేపీలో జాయిన్ అవుతార‌నే టాక్ బ‌లంగా వినిపించింది. అ్ంతేగాక ఆయ‌న వ్యాఖ్య‌లు పార్టీలో గంద‌ర‌గోళం సృష్టించాయి.

తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్‌కు బీజేపీయే ప్ర‌త్యామ్నాయం అని, రాజ‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించి పార్టీలో క‌ల‌కలంరేపాడు. దీంతో ఆయ‌న బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. కానీ ఏం జ‌రిగిందో ఏమోకానీ ప్ర‌స్తుతం ఆయ‌న సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ తో కూడా అంటీ ముట్ట‌న‌ట్లుగానే ఉంటున్నారు. ఈక్ర‌మంలోనే తాజాగా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌రిగిన ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ప్రారంభోత్స‌వంలో మంత్రి కేటీఆర్‌ను రాజ‌గోపాల్‌రెడ్డి ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.

దీంతో రాజ‌గోపాల్ రెడ్డి అధికార టీఆర్ ఎస్‌లో చేరుతారనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల జ‌రిగిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవ‌డంతో ప‌లువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఇందులో కొంద‌రు అధికార పార్టీ వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈక్ర‌మంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను పొగిడార‌ని ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version