తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 1037 మంది అభ్యర్థులు వివిధ పార్టీల గుర్తులపై పోటీ చేస్తున్నారు. కొందరు స్వతంత్రులు కూడా ఉన్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ఎంఐఎం, బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీ ఇలా పేరు గొప్ప నుంచి ఊరు దిబ్బ వరకు అనేక పార్టీలు పోటీ చేస్తున్నాయి. వాటి తరఫున అభ్యర్థులు నామినేషన్ ఘట్ఆన్ని కూడా పూర్తి చేశారు. అయితే.. ఇంత మంది అభ్యర్థుల్లోనూ కేవలం ఇద్దరి చుట్టూ ఇప్పుడు సంచలన చర్చ సాగుతోంది.
తాజాగా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో తమ తమ ఆస్తులను వెల్లడించారు. ఇది సహజం కూడా. కోటీశ్వరుడు, విద్యావ్యాపార వేత్త అయిన.. మల్లా మల్లారెడ్డి తనకు కారు లేదని వెల్లడించడం సంచలనమైంది. అలానే.. ఇప్పుడు కోమటిరెడ్డి, పొంగులేటిలు కూడా.. వారి వారి ఆస్తులకు సంబంధించి రాష్ట్రంలోనే హైలెట్‌గా నిలిచారు.
పొంగులేటి ఆస్తి ఏకంగా 434 కోట్లరూపాయలుగా వెల్లడించారు. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తన అఫిడవిట్‌లో తన ఆస్తిని 458 కోట్లుగా పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు వీరి చుట్టూ చర్చకు కారణమైంది. ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఫిడవిట్ దాఖలు చేసిన వారిలోఎవరూ ఈ రేంజ్‌లో ఆస్తులు ఉన్నట్టు చెప్పలేదు. దీంతో వీరిద్దరి అఫిడవిట్లు ఆసక్తి రేపుతున్నాయి. చిత్రం ఏంటంటే.. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తుండడం గమనార్హం.