ఆ నలుగురు మంత్రులు ఉద్యమకారులా? : రాజగోపాల్‌రెడ్డి

-

తెరాస.. తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆయన అందజేశారు. తన రాజీనామాను సభాపతి ఆమోదించినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

“ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం, పేదలకు ఇళ్లు, పింఛన్ల కోసం రాజీనామా చేశా. నేను రాజీనామా అనగానే గట్టుప్పల్‌ మండలం ఏర్పాటు చేస్తున్నారు. సీఎంకు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప ఇతరుల నియోజకవర్గాలు కనిపించడం లేదు. ప్రాజెక్టులు కట్టొద్దని మేం చెప్పలేదు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఏమైంది? మిషన్‌ భగీరథలో రూ.25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా? జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది. మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌ ఉద్యమకారులా? తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు.” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version