మళ్ళీ ఉపఎన్నికలు: కోమటిరెడ్డి ఆ రిస్క్ తీసుకుంటారా?

-

తెలంగాణలో మళ్ళీ ఉపఎన్నికలు రాబోతున్నాయా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకుల నుంచి సమాధానం వస్తుంది. ఇప్పటికే వివిధ కారణాలతో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉపఎన్నికలు వచ్చాయి. హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌ల్లో టీఆర్ఎస్ గెలవగా, దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది.

 

ఇక త్వరలోనే వేములవాడ స్థానానికి ఉపఎన్నిక జరగనుందని ప్రచారం జరుగుతుంది. వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదంపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ కోర్టు తీర్పు రమేశ్‌కు అనుకూలంగా వస్తే ఇబ్బంది లేదు. కానీ వ్యతిరేకంగా వస్తే మాత్రం…ఆయన శాసనసభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అక్కడ కూడా ఉప ఎన్నిక ఖాయమవుతుంది. అంటే వేములవాడ ఉపఎన్నిక అనేది కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది.

ఆ విషయం పక్కనబెడితే మునుగోడు స్థానానికి కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొద్ది నెలలుగా ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని కూడా మాట్లాడారు. అలాగే బీజేపీకి ఆదరణ పెరుగుతుందని, తాను సమయం చూసుకుని బీజేపీలోకి వెళ్తానని అన్నారు. అయితే ఇదంతా ఏడాది కిందట ప్రచారం…కానీ ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలవడంతో కోమటిరెడ్డి ఆ పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం వస్తుంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బీజేపీలో చేరిక ఖాయమైందని, ఒకటి, రెండు నెలల్లో రాజగోపాల్‌రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.

అంటే కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారని బీజేపీ వర్గాల ప్రచారం బట్టి తెలుస్తోంది. దీని బట్టి మునుగోడుకు ఉపఎన్నిక వస్తుంది. అయితే ఆ రిస్క్ కోమటిరెడ్డి తీసుకుంటారా? అనేది డౌట్. ఉపఎన్నిక వస్తే ఆర్ధికంగా ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ రెండేళ్లలో ఎలాగో ఎన్నికలు వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఇప్పుడు కోమటిరెడ్డి రిస్క్ చేయడం కష్టమే. నెక్స్ట్ ఎన్నికల ముందు పరిస్తితులని బట్టి పార్టీ మారతారేమో గానీ, ఇప్పుడైతే ఆ రిస్క్ తీసుకోరనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version