టీపీసీసీ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కు రాజీనామా చేసిన కొండా సురేఖ.. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు నాకు అసంతృప్తిని కలిగించాయని తెలిపారు. తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ లో నా పేరు లేకపోవడం, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్థాపం కలిగించిందని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ లో నాకంటే జూనియర్లను నామినేట్ చేశారని, నన్ను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను నియమించడం అవమానపరిచినట్టుగా భావిస్తున్నానని ఆమె వెల్లడించారు. నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యమని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్తల కొనసాగుతానని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కమిటీలను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే.. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా కొండా సురేఖ నియమించింది అధిష్టానం. దీంతో పైవిధంగా కొండా సురేఖ స్పందించింది.