బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని.. దేశంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ రోజు భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచే రోజని అన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి రోజునే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ రాసిన రాజ్యంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన ఘనత, చరిత్రలో నిలిచేలా విగ్రహాన్ని స్థాపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
కేసీఆర్ నిర్ణయం గొప్ప చారిత్రాత్మక నిర్ణయమని, రాష్ట్రానికే గర్వకారణం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినందించాలన్న లక్ష్యంతో 125 అడుగులు భారీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని స్పష్టం చేశారు. దేశానికి ఆదర్శంగా అమలవుతున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుందన్నారు. దశాబ్దాల చీకటి అలుముకున్న పేద, దళితుల జీవితాల్లో దళితబంధు ద్వారా సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. రాష్ట్రంలోని 38వేల కుటుంబాలకుపైగా పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. రూ.17,700కోట్ల బడ్జెట్ కేటాయించి 1.77లక్షల మందికి ప్రభుత్వం దళితబంధు అమలు చేయనున్నట్లు తెలిపారు.