సాధారణంగా మహిళలు పది మందికి కూడా జన్మనిచ్చిన సంఘటనలు చూశాం. కానీ 28 ఏళ్ల వయసులోనే ఎక్కువ మంది పిల్లలను కన్న సంఘటనలు చాలా అరుదు. అలాంటి మహిళ కథే ఈ స్టోరీ. అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది.
2001లో పదిహేడేళ్ల వయసులో కోరా తొలిసారి గర్భం దాల్చింది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త ఆండ్రే డ్యూక్‌తో పాటు 8 మంది సంతానంతో కలిసి నివసిస్తోంది. వీరికి పుట్టిన మూడో సంతానం ఏడు రోజులకే కన్నుమూసింది. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను ఆకర్షించింది.
ఇంతమంది పిల్లలను కనడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు రావడంతో కోరా క్లారిటీ ఇచ్చింది. కావాలని ఇంత మంది పిల్లలను కనలేదని.. సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం ధరించినట్లు తెలిపింది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు చెప్పింది.