నందమూరి కుటుంబపై చంద్రబాబుది కపట ప్రేమ అని మంత్రి కేటీఆర్ అన్నారు. బాబుకి నిజంగా నందమూరి కుటుంబంపై ప్రేమ ఉంటే.. లోకేష్‌ను నేరుగా మంత్రిని చేసినట్లే.. సుహాసినిని కూడా మంత్రిని చేయొచ్చుగా కదా అని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం కూటకట్ పల్లి నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు తరుపున కేటీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… కూకట్ పల్లిలో ఎలాగో ఓడిపోతామని తెలిసి ఆ సీటుని సుహాసినికి కేటాయించి ఆమెను బలి పశువును చేశారని వ్యాఖ్యానించారు.
ఏం తప్పు చేశానని తనను విమర్శిస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ….తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదా అంటూ నిలదీశారు. రూ. 50లక్షలతో ఆ పార్టీ నేత అడ్డంగా దొరికారు కదా… ఆ సమయంలో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడలేదా… అంటూ చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు. డిసెంబర్ 11 తర్వాత చంద్రబాబు ఫిడేల్.. రాహుల్ గాంధీ వీణ వాయించుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ఢీకొట్టే దమ్ములేక నాలుగు పార్టీలు కూటమి కట్టాయని ఎద్దేవా చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి కలికాలంలో విచిత్రాలు జరుగుతాయని చెప్పినట్లు.. బద్ధ శత్రువులైన రెండు పార్టీల కలయిక ఓ విచిత్రమేనని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో నందమూరి కుటుంబం నుంచి ఎవర్ని రాజకీయాల్లోకి ఎవరూ రాకుండా చేసేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.