మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.
కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారన్నారు. కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్‌కి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు.
కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయ్యిండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ మరియు ఇతర అంశాల పైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయన్నారు.