ముక్కు నేలకు రాసి.. అమిత్ షా క్షమాపణ చెప్పాలి – కేటీఆర్

-

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం భూత్ పూర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన అమిస్తాపూర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మనం 119 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. దేవరకద్రలో పెద్ద ఎత్తున 21 చెక్ డ్యామ్ లు కట్టి చూపించిన నాయకుడు మీ ఎమ్యెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. సిరిసిల్లలో కూడా 12 డ్యామ్ లు మాత్రమే ఉన్నాయి. దేవరకద్ర చెక్ డ్యామ్ లు ఒకదానికొకటి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్టే ఉన్నాయి. త్వరలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ గా మారుస్తాం. ఇక ఇక్కడ ఇండ్లు, మంచినీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే. ఇంటింటికి నీళ్లు ఇచ్చి అడబిడ్డల కష్టం తీర్చారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఆసుపత్రులని టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తుండటంతో నేడు 30% నుండి 52% ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయన్నారు.

పల్లెటూర్లకు కూడా అపార్ట్ మెంట్ లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుంది. పేదలు ఒక్క పైసా ఖర్చు లేకుండ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పారదర్శకంగా కేటాయింపు చేసాం. పాలమూరు జిల్లాలో కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ప్రధాని ఇదే ప్లేస్ లో మీటింగ్ పెట్టి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చి.. మనకి అన్యాయం చేసాడు మోడీ.

అసలు కేంద్రంకు తెలంగాణ మీద ప్రేమే లేదు. కృష్ణ నీళ్లలో 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో వాటా ఉంటే.. ఎనిమిది ఏండ్ల నుండి మన వాటా అడుగుతున్నా కేంద్రం నుండి ఉలుకు పలుకు లేదు. రైల్వే ప్రాజెక్ట్ లు ఇవ్వరు, జాతీయ హోదా ఇవ్వరు. ఎనిమిది ఏండ్లలో కేంద్రానికి 3,68,797 కోట్ల రూపాయలు తెలంగాణ ఇస్తే.. మనకి 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే వాపస్ ఇచ్చారు. మనమే ఈ భారతదేశంకు, వెనకబడ్డ రాష్ట్రాలకు రెండు లక్షల కోట్లు ఇచ్చాము. నేను చెప్పేది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. అమిత్ షా తప్పు చెప్తే ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ లోని పథకాలు లేవు. ఇక మన బండి ఏమో మజీదులు తవ్వుతా అంటున్నాడు. ఆయన పని తొవ్వుడేనేమో. వారి నోటి నుండి ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధిపై మాట రాదు. దేవరకద్ర సాగునీరు తీసుకొచ్చి.. అలాంటి కొన్ని మంచి పనులు చేసి.. ప్రజల మనసులు గెలవాలి కానీ ఇలా విద్వేషాలు రగిల్చి పిల్లల మనసులు చెడగొట్టొద్దు’ అంటూ మోడీ, అమిత్ షా, బండి సంజయ్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version