తెలంగాణ తెలుగుదేశం పార్టీ నందమూరి ఆడపడుచుని ఎన్నికల బరిలో దింపింది. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి దివంగత తెదేపా నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఆ స్థానాన్ని ఎప్పటి నుంచో ఆశిస్తున్న కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుకు సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడానికి గల కారణాలను వివరించినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ కుటుంబానికి టికెట్ ఇస్తున్నందున అంతా సహకరించాలని కూకట్‌పల్లి తెదేపా నేతలకు చంద్రబాబు నాయుడు సూచించినట్లు సమాచారం.. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని కూకట్ పల్లిలో అధికంగా ఉన్న సీమాంధ్ర ప్రజలు స్వాగతించినట్లు తెలుస్తోంది. విశాఖ నోవాటెల్‌లో చంద్రబాబుని సుహాసిని కలిశారు. దీంతో ఆమెకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. తెతెదేపా అధ్యక్షుడు రమణను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. శనివారం ఆమె నామినేషన్ వేయనున్నారు.