కర్నూలు జిల్లా కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడుకుంటున్న నలుగురు విద్యార్థులపై పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కాత్రికి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు ఊరి శివారులో క్రికెట్ ఆడుకుంటున్నారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనతో కాత్రికి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.