ఏంటో ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కాస్త మార్పు కనిపిస్తోంది…ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన కాంగ్రెస్..ఇప్పుడు కేసీఆర్‌కు కాస్త అనుకూలంగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎప్పటినుంచో టీఆర్ఎస్-బీజేపీ అన్నట్లుగానే రాజకీయ యుద్ధం నడుస్తోంది. నిజానికి బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అయినా సరే కేసీఆర్ గాని, టీఆర్ఎస్ నేతలు గాని కాంగ్రెస్‌ని టార్గెట్ చేయకుండా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు.
కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తే తమకు రాజకీయంగా ఇబ్బంది అని, అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తే రాజకీయ లబ్ది ఉంటుందనే కోణంలో కేసీఆర్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ రాజకీయం ఎలా ఉన్నా సరే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం..కేసీఆర్‌ని గట్టిగానే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. పైగా ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ అయ్యారు. అదే సమయంలో ఆయన…కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో ఆ ఇంటి మీద కాకి..ఈ ఇంటి మీద వాలే ప్రసక్తి లేదని, కేసీఆర్‌తో కలిసే ప్రసక్తి లేదని రేవంత్ తేల్చి చెప్పేశారు. రేవంత్ మాట్లాడుతున్నారు గాని..ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్‌పై విమర్శలు చేయడం లేదు. పైగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌కు సపోర్ట్‌గా భట్టి విక్రమార్క బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరిని కేసీఆర్‌కు అనుకూలంగా రాజకీయం చేసేలా కథ నడిపిస్తున్నారని ప్రచారం ఉంది.
పైగా తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన ఎన్నికల్లో 40 స్థానాల్లో బలహీనమైన క్యాండిడేట్లని పెట్టి…కేసీఆర్ విజయానికి కృషి చేశారని కేవీపీపై ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి కేవీపీ ఎంట్రీ ఇచ్చి..కాంగ్రెస్ ద్వారా..కేసీఆర్‌కు లబ్ది చేకూరేలా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. తాజాగా కూడా కేవీపీ అదే పనిలో ఉన్నారని, అందుకే ఈ మధ్య కాంగ్రెస్ నేతలు కొందరు..కేసీఆర్ పట్ల అనుకూలంగా ఉంటూ..బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.
అలాగే రేవంత్ వ్యతిరేక వర్గాన్ని ఈయనే ఎంకరేజ్ చేస్తూ..రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా ముందుకెళుతున్నారని టాక్ నడుస్తోంది. రేవంత్ ఏ స్థాయిలో కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నారో తెలిసిందే. ఇలాంటి తరుణంలో రేవంత్‌కు సపోర్ట్ గా ఉన్నట్లే ఉంటూ..వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ప్రతి నెల కొందరు కోవర్టులు కేసీఆర్ దగ్గర పెన్షన్లు తీసుకుంటున్నారని ఏఐసిసికి చెందిన ఒక నేత ఆ మధ్య విమర్శలు చేశారు. అంటే కాంగ్రెస్ వీక్ గా ఉంటేనే కేసీఆర్‌కు ప్లస్. అదే పని చేస్తూ కేవీపీ ముందుకెళుతున్నారని విమర్శలు వస్తున్నాయి.