ఈ సృష్టిలో ఎన్నో వింత ప్రదేశాలు ఉన్నాయి. వాటిగురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో హర్రర్ స్టోరీస్ అయితే ఇంకా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటిదే..ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో ‘త్రిశూల్’ పర్వతం దేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఈ సరస్సులో వేసవి కాలంలో వందల సంఖ్యలో అస్థిపంజరాలు ప్రత్యక్షమవుతాయట. ఏటా ఇలా జరుగుతూనే ఉంటుంది. అసలు ఆస్తిపంజరాలు ఎవరివి, ఎందుకు అక్కడకు వస్తాయో ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు.
ఏడాదిలో 11 నెలలు ఈ సరస్సు మంచుతో కప్పి ఉంటుంది. మే నెలలో మాత్రమే ఆ సరస్సులో నీరు కనిపిస్తుంది. మే నెలలో ఎండలకు సరస్సులో నీరు తగ్గే కొద్ది సరస్సు అంచులో అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇలా చాలా ఏళ్లుగా జరుగుతోంది. కానీ ఇప్పటికి ఆ అస్థిపంజరాలు అక్కడ ఎందుకున్నాయో ఎవరు చనిపోయారో ఎవరికి తెలియదు. అసలు వందలాది మంది ఒకేసారి ఎలా చనిపోయారనేది పెద్ద ప్రశ్న. రూపకుండ్ సరస్సుకి మరో పేరు స్కెలిటన్ లేక్. ఆ పేరు రావటానికి కారణం అందులో దొరికిన అస్థి పంజరాలే. చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి 5,029 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు ఉంది. త్రిశూల్ పర్వతం దిగువున, సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న రూపకుండ్ సరస్సు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
స్వాతంత్రం రాకముందే కనిపెట్టారట…
1942లో బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన నందా దేవి అటవీ రేంజర్ హెచ్ .కె మద్వాల్ అనే ఓ అటవీ అధికారి తొలిసారిగా అస్థిపంజరాలను చూశాడు. అప్పటినుంచీ ఈ సరస్సుపై దేశవిదేశీ సంస్థలు చాలా పరిశోధనలు చేశాయి. అయితే, ఆ అస్తిపంజరాలు ఎవరివీ? అక్కడ వందల సంఖ్యలో ప్రజలు ఎందుకు చనిపోయారు? అసలేం జరిగింది? అనే విషయంపై పరిశోధనలు జరిగాయి కానీ..సమాధానం మాత్రం తెలుసుకోలేకపోయారు.
కామన్ పాయింట్ ఒకటుంది..
వీరిలో చాలా మంది పొడుగు మనుషులు, “సగటు ఎత్తు కన్నా ఎక్కువ ఉండేవారని” మాత్రం తేలింది,. వీరిలో ఎక్కువ భాగం మధ్య వయస్కులు.. 35 నుంచీ 40 ఏళ్ల మధ్యలో ఉన్నారట.. పసివాళ్లుగానీ, చిన్నపిల్లలుగానీ ఎవరూ లేరు. కొందరు వృద్ధ మహిళలు ఉన్నారు. అందరూ దాదాపు మంచి ఆరోగ్యవంతులేనట… వీరంతా ఒకే సమూహానికి చెందిన మనుషులని, 9వ శతాబ్దంలో సంభవించిన ఒక విపత్తు కారణంగానే వీరందరూ మరణించారని ప్రాథమిక అంచనాకు సైంటిస్టులు వచ్చారు. రూపకుండ్ సరస్సుపై ఇప్పటికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్ సంస్థ
ఇక్కడి రహస్యాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనల్లోనే ఈ అస్థికలకు వేల ఏళ్ల చరిత్ర ఉందన్న సంగతి తెలుసుకున్నారు.. 2004వ సంవత్సరంలో కొందరు పరిశోధకులు ఈ అస్థిపంజరాలు 850 సంవత్సరాల క్రితం నాటివని గుర్తించారు. అయితే ఒకేసారి వందలాదిమంది మృత్యువాత పడటానికి దారితీసిన పరిస్థితులేమిటన్నది ఇప్పటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. అసలు నిజం తెలుసుకునే సరికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందో..!
-Triveni Buskarowthu