చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో లక్ష్మీపార్వతి సంతోషం వ్యక్తం చేశారు. రేపు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళి అర్పించనున్నట్లు చెప్పారు. బాబు అవినీతిపరుడని తన భర్త ఎప్పుడో చెప్పాడన్నారు. పార్టీని, పదవిని లాక్కొని ఎన్టీఆర్ను మానసిక హింసకు గురిచేసిన బాబు పాపం నేడు పండిందని లక్ష్మీపార్వతి అన్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు.
అయితే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది. చంద్రబాబుకు అవసరమైన ఔషధాలు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశించింది.
కాగా, చంద్రబాబు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో, ఆయనను అధికారులు ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. చంద్రబాబును ఆయన సొంత కాన్వాయ్ లోనే తరలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నాయి. కాగా, చంద్రబాబు వెంట రాజమండ్రికి నారా లోకేశ్ కూడా వెళుతున్నట్టు తెలుస్తోంది.