తెలంగాణలో వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి ప్రాణ హాని ఉందని చెబుతున్నారు పోలీసులు. అందుకే ఆయనకు నిన్న సిటీ పోలీస్ కమిషనర్ నుండి ఒక లేఖ అందింది. మీకు ప్రాణ హాని ఉన్న కారణంగా మీ గన్ మెన్లను మారుస్తున్నామని, ఇప్పుడు ఉన్నవారిని ట్రైనింగ్ కి పంపిస్తూ ఆల్రడీ ట్రైన్ అయి ఉన్నవారిని పెడుతున్నామని పేర్కొన్నారు. అంతే కాక ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ వాహనంలోనే తిరగాలని అన్నారు.
ఒక్కోసారి బైక్ మీద తిరుగుతున్నట్టు తెలిసిందని, అలా తిరగడం సేఫ్ కాదని పేర్కొన్నారు. ఈ విషయం మీద రాజా సింగ్ మాట్లాడుతూ నిన్న అడిషనల్ డీసీపీ వచ్చాడని, చుట్టు పక్కల ఎవరు ఉంటారని ఆరా తీశారని అన్నారు. అలానే నా గన్ మెన్ గన్స్ కూడా మార్చారన్న ఆయన నాకు ఎవరి నుండి త్రెట్ ఉందొ చెప్పాలని కోరుతున్నానని అన్నారు. టెర్రరిస్టుల నుండి ఉందా , స్థానికంగా ఉండే ఏదన్నా సంస్థల నుండి ఉందో స్పష్టం చేయాలని అయన కోరారు. ఈ విషయం మీద క్లారిటీ కోసం రాష్ట్ర హోం మంత్రికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖలు రాస్తున్నానని ఆయన పేర్కొన్నారు.