తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,933 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో ఇప్పటివరకు మొత్తం 15,412 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 328 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,428 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
అలాగే తెలంగాణ విషయానికొస్తే.. కొత్తగా 1,269 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 8 మంది మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,671కి చేరుకుంది. ఇప్పటివరకు 22,482 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 356 మంది మరణించారు. ప్రస్తుతం 11,883 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నేడు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 800 కరోనా కేసులు వచ్చాయి.