బీజేపీ-జనసేనకు పరీక్షగా మారిన స్థానిక ఎన్నికలు

-

ఏపీలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ సమరం వాడీవేడీగా ఉంది. అధికార పార్టీ ఏగ్రీవాలపై దృష్టి పెడితే.. ఢీకొట్టేందుకు టీడీపీ సై అంటోంది. అక్కడక్కడా బీజేపీ, జనసేనలు మేము ఉన్నాం అని సిగ్నల్స్‌ ఇస్తున్నాయి. తిరుపతి లోక్‌సభ పరిధిలో మాత్రం ప్రధాన పార్టీలు ప్రత్యేక ఫోకస్‌ పెట్టాయి. త్వరలో ఇక్కడ లోక్‌సభ ఉపఎన్నిక జరగబోతుండటమే దీనికి కారణం. ఉప ఎన్నిక పై జనసేన,బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఎన్నిస్థానాల్లో పై చేయి సాధిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

తిరుపతి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నిచోట్లా అధికారపార్టీ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. రెండు జిల్లాల పరిధిలో ఇవి ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో వైసీపీ బలంగానే కనిపిస్తోంది.తిరుపతి లోక్‌సభ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటామనే ధీమా అధికార పార్టీలో ఉంటే.. ముందుగానే అభ్యర్థిని ప్రకటించి సైలెంట్‌ అయిపోయింది టీడీపీ.

ఇక్కడ పుంజుకుని ఏపీలో బలపడాలని లెక్కలేస్తున్న బీజేపీ-జనసేన కూటమి మాత్రం ఉమ్మడి అభ్యర్థిపై తేల్చుకోలేకపోతోంది. కాకపోతే టికెట్‌ ఆశిస్తున్నవారిలో బీజేపీ నుంచి డజను మందికిపైగా.. జనసేన నుంచి మరో పది మంది ఉన్నట్టు చెప్పుకొంటున్నాయి. అయితే లోక్‌సభ ఉపఎన్నిక కంటే ముందు వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటో పరిశీలించుకోవాలని రెండు పార్టీలలోని నేతలు నిర్ణయించారట. తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే గ్రామ పంచాయతీలలో బలాన్ని అంచనా వేసుకునే పనిలో పడ్డారట.

తిరుపతి లోక్‌సభ పరిధిలో దాదాపు 850కిపైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ స్థానాల్లో బీజేపీ, జనసేనల నుంచి ఎంతమంది మద్దతుదారులు బరిలో ఉంటారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. చాలా చోట్ల పోటీకి అభ్యర్థులు దొరకడం లేదన్నది టాక్‌. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మిగతా చోట్ల ఎలా ఉన్నా.. లోక్‌సభ పరిధిలో మాత్రం అభ్యర్థులు బరిలో ఉండాల్సిందేనని బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సందర్భంగా బీజేపీ, జనసేన నేతలు పడుతున్న ఆపసోపాలను చూసి పంచాయతీలకు అభ్యర్థులు లేరు కానీ.. లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో గెలుస్తారా అని వైసీపీ, టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారట.

గణనీయంగా పంచాయతీలును గెలుచుకుంటామని పైకి చెబుతున్నా.. ఈ రెండు పార్టీలకు లోపల మాత్రం గుబులుగానే ఉందట. లోక్‌సభ ఉపఎన్నికకు ముందు బీజేపీ-జనసేనలు ఇక్కడ ఏ మాత్రం సత్తా చాటుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version